I was surfing the net and googling using other language words for "Tamil Eelam". I got this Telugu language Blog in which the author summarises the Tamil Nation's struggle and issues on a netshell.
http://kadalitaraga.wordpress.com/2009/05/23/srilanka1/
Posting the contents, so that incase a Telugu reader reads this , he/she can forward the same to their friends.
Thanks "kadalitaraga " .
శ్రీలంక తమిళజాతి హననంలో చివరి అడుగు
మే 23, 2009 ఎన్.వేణుగోపాల్ చే
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్ టి టి ఇ) అనేది తీవ్రవాద సంస్థనా, దాని మూడు దశాబ్దాల రక్తసిక్త చరిత్రలో చేసిన ఘోరమైన రాజకీయ, సాంస్కృతిక, సైనిక తప్పిదాలకు అది ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందా, అసలు శ్రీలంకలో నివసిస్తున్న ఇరవైలక్షల పైచిలుకు తమిళులందరికీ ఎల్ టి టి ఇ ప్రాతినిధ్యం వహిస్తుందాలేదా, శ్రీలంక తమిళ సమస్యల పరిష్కారానికి ఎల్ టి టి ఇ హింసాత్మక, సాయుధపోరాట మార్గం ఎంచుకోవడం సరయినదేనా, వగైరా ఎన్ని ప్రశ్నలయినా ఇప్పుడు వేసుకోవచ్చు గాని నిజానికి ఆ ప్రశ్నలకు ఇప్పుడంత ప్రాధాన్యత లేదు. ఆ చర్చ ఇప్పుడు కేవలం పండిత చర్చే అవుతుంది. బహుశా శ్రీలంక అధ్యక్షుడుగా మహింద రాజపక్షే అధికారంలోకి వచ్చిన 2005 నవంబర్ నుంచీ, లేదా తమిళ ఈలం వాదులమీద పెద్ద ఎత్తున దాడి చేయాలని నిర్ణయించుకున్న 2006 అక్టోబర్ నుంచీ, ఒకవైపు విపరీతంగా సైనిక వ్యయాన్ని పెంచి, మరొకవైపు ఎల్ టి టి ఇ పై మానసిక యుద్ధాన్ని కొనసాగించి ముప్పేట దాడి సాగించిన కాలంలోనే ఆ ప్రశ్నలకు కాలం చెల్లిపోయింది.
ఇప్పుడిక సమస్య ఎల్ టి టి ఇ ది కాదు. ప్రపంచంలో ఏదో ఒక జన సమూహం ఆకాంక్షలను నెరవేర్చడం కొరకు సాయుధంగానో, నిరాయుధంగానో సుదీర్ఘకాలం పోరాడి, గెలిచి, ఓడి, అంతిమంగా ఓడి చరిత్ర గర్భంలో కలిసిపోయిన అనేక సంఘటిత నిర్మాణాల జాబితాలో ఎల్ టి టి ఇ చేరిపోయే క్రమం ఎప్పుడో మొదలయింది.
ఇప్పుడిక ప్రశ్న శ్రీలంకలో కనీసం రెండువేల సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ, తమ స్వతంత్ర సాంస్కృతిక, భాషా అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్న తమిళ జాతి జీవనం ఏమవుతుంది అనేది. ఆ దీర్ఘకాలిక సమస్య అలా ఉంచినా, ఇవాళ్టికివాళ శ్రీలంక సైనిక బలగాలు సాగిస్తున్న అతి క్రూరమైన నిర్బంధకాండలో పిట్టల్లా రాలిపోతున్న తమిళ ప్రజానీకపు జీవనపోరాటం గురించి ఆలోచించవలసి ఉంది. సైనికుల చక్రబంధం మధ్య అడవులలోనో, సైనికులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలలోనో అణచివేతలో దుర్భరంగా బతుకు ఈడుస్తున్న లక్షలాది మంది తమిళులది. అంతర్జాతీయ సేవా సంస్థలు, వైద్య సహాయ సంస్థలు ఎంత ప్రయత్నిస్తున్నా, సైనిక అవరోధాల వల్ల ఉపశమనం దక్కకుండాపోతున్న చిన్నారి పిల్లలది, వృద్ధులది, అనారోగ్య పీడితులది. నామమాత్రపు శరణార్థి, సహాయ, పునరావాస శిబిరాలలో పోగువేసిన తమిళుల మందల మీద ఎటువంటి నిరాదరణ అమలవుతున్నదో స్వతంత్ర పరిశీలకులు కూడ చెపుతున్నదాన్ని బట్టి, శ్రీలంక సైన్యం ఎల్ టి టి ఇ ని అణచివేయడానికి మాత్రమే కాదు, పనిలోపనిగా శ్రీలంక తమిళులకు “పాఠం నేర్పే పవిత్ర కర్తవ్యాన్ని” చేపట్టినట్టు కనబడుతున్నది.
ఎల్ టి టి ఇ సాగించిన తమిళ ఈలం పోరాటాన్ని, అది చేపట్టిన అనేక పోరాటరూపాలను సమర్థించినా, సమర్థించకపోయినా, మనపొరుగునే, మనకళ్లముందే ప్రస్తుతం జరుగుతున్న ఈ మహామానవ విషాదం గురించి తప్పకుండా ఆలోచించవలసి ఉంది.
శ్రీలంకలో అత్యధిక సంఖ్యాక జాతిగా సింహళ జాతి తమ నేలమీది అల్ప సంఖ్యాక జాతులన్నిటినీ నిర్మూలించదలచుకున్నదనీ, జాతి దురహంకారంతో హిట్లర్ సాగించిన జాతిహనన కాండ తర్వాత అంతటి దుర్మార్గమైన మారణకాండకు పాల్పడడం ప్రారంభించిందనీ ఇరవయో శతాబ్ది శ్రీలంక చరిత్ర అంతా సాక్ష్యం పలుకుతుంది. నిన్నమొన్నటి విజయాల గర్వంతో శ్రీలంక సింహళ జాతి ఆ పనిని కొనసాగిస్తుందా? అందులోనూ విజయం సాధిస్తుందా? ఆ దారుణం జరిగిపోతుంటే సభ్య ప్రపంచమంతా మౌనసాక్షి లాగ ఉండిపోతుందా? ప్రపంచదేశాలన్నీ ఏం చేసినా, భాషనూ, ఉమ్మడి గతాన్నీ, సంస్కృతినీ పంచుకునే భారత తమిళులమీద ఈ హననకాండ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇవీ ఇవాళ ఆలోచించవలసిన ప్రశ్నలు.
నిజానికి శ్రీలంకలో తమిళజాతి జీవన్మరణ సమస్యలను ఎదుర్కోవడం ఇప్పుడే ప్రారంభం కాలేదు. “తమిళుల సమస్యలకు ఎల్ టి టి ఇ నే కారణం” అని ఇవాళ చచ్చిన పాము మీద మరొక రాయి విసరడానికి ప్రణబ్ ముఖర్జీ ఉత్సాహపడవచ్చుగాని, సింహళ పాలకవర్గాల చేతిలో శ్రీలంక తమిళులు అనుభవించిన దోపిడీ, పీడన, వివక్షల గురించి లక్షలాది అనుభవాలు, వేలాది పేజీల్లో నమోదయ్యే ఉన్నాయి. బ్రిటిష్ వలసవాదులు వెళ్లిపోయి, శ్రీలంక సింహళ జాతికి దేశాధికారం దక్కిన 1948 కన్న చాల ముందు నుంచీ కూడ, పరాయిపాలనలో కూడ సింహళ జాతీయులు సోదర తమిళులను అవమానాలపాలు చేశారనీ, పీడించారనీ, చిన్నచూపు చూశారనీ ఎన్నో ఆధారాలున్నాయి.
భారత కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు ఎ కె గోపాలన్ ఆత్మకథలో 1936 లో శ్రీలంక (అప్పటి సిలోన్) పర్యటించినప్పుడు అక్కడ భారత మలయాళీలమీద, తమిళులమీద సింహళీయులలో కనబడిన విద్వేషం గురించి వివరంగా రాశారు. ఆయన ప్రసంగించవలసిన ఒక సమావేశంపై సింహళీయులు రాళ్లు విసిరి దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు, తాను స్థానిక పత్రికలకు వ్యాసాలు రాశానని ఆయన వివరించారు. “భారతీయులకు, సింహళీయులకు మధ్య జరిగే వ్యక్తిగత తగాదాలకు కూడ జాతి వ్యతిరేకత రంగు పులమబడుతున్నదని, ఈ ధోరణిని అరికట్టకపోతే అతి దారుణమైన ఫలితాలు, పర్యవసానాలు ఉంటాయని” తాను ఆ వ్యాసాలలో హెచ్చరించానని గోపాలన్ రాశారు. నిజంగా ఏడు దశాబ్దాల తర్వాత ఆయన మాటలు ఎంత అక్షరసత్యాలో అర్థమవుతున్నాయి.
శ్రీలంక తమది మాత్రమేనని, అక్కడ ఉన్న ఇతర భాషల ప్రజలందరూ బయటివారేనని, ముఖ్యంగా తమిళ భాషా ప్రజలందరూ భారతీయులేనని, అందువల్ల వారు రెండవస్థాయి పౌరులుగా బతకవలసిందేనని సింహళుల విశ్వాసం. దేశంలోని అన్ని సింహళ రాజకీయపక్షాలకు వాటిలో వాటికి ఎన్ని విభేదాలున్నా, పరాయి జాతుల పట్ల వ్యతిరేకతలో మాత్రం ఏకాభిప్రాయమే.
అందుకే దేశ స్వాతంత్ర్యం రాగానే 1948లో డి ఎస్ సేనానాయకే నాయకత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిలోన్ పౌరసత్వపు చట్టం భారతీయ సంతతి వారికి పౌరసత్వాన్ని నిరాకరించే పేరుతో తమిళులందరి పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఆ దుర్మార్గ చట్టాన్ని ఎత్తివేయించడానికి సుప్రీంకోర్టుకూ, చివరికి బ్రిటన్ లోని ప్రైవీ కౌన్సిల్ కూ మొరపెట్టుకుని ఓడిపోవడంతో, అంటే 1948 నుంచే ఆ దేశంలో తమిళుల ఆత్మగౌరవపోరాటం ప్రారంభమయింది.
ఆ తర్వాత 1956 లో దేశంలో సింహళాన్ని ఏకైక అధికార భాషగా ప్రకటిస్తూ మరొక చట్టం తేవడంతో సింహళ పాలకవర్గాల ఉద్దేశ్యాలు మరింతగా స్పష్టమయ్యాయి. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమిళ ప్రజాప్రతినిధులు చేసిన శాంతియుత సత్యాగ్రహాన్ని సింహళ సంస్థలు హింసాత్మకంగా అడ్డుకుని, తమిళులను ఊచకోత కోశాయి. ఆ తర్వాత, రాజ్యాంగంలో 1947 లోనే తమిళులకు కల్పించిన రక్షణలను తొలగిస్తూ సిలోన్ ప్రభుత్వం 1972లో రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. అంతటితో సరిపోనట్టు, దేశంలో తమిళ జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో, జననిష్పత్తిని మార్చడానికి అక్కడికి సింహళీయులను వలస పంపించి వారికి ఆవాసాలు కల్పించే పథకాన్ని శ్రీలంక ప్రభుత్వం 1980ల్లో మొదలుపెట్టింది.
ఈ విధానాలవల్ల మొత్తం మీద శ్రీలంకలో ఇప్పటికి నాలుగుసార్లు (1958, 1977, 1981, 1983) అతిపెద్ద జాతి కల్లోలాలు జరిగి వేలాది మంది బలి అయిపోయారు. ఆ తర్వాత ఇక తమిళుల సమస్య పరిష్కారం సమైక్య శ్రీలంకలో సాధ్యం కాదనీ, తూర్పు, ఉత్తర ప్రాంతాలతో స్వతంత్ర ఈలం (చరిత్రలో తమిళ స్వతంత్ర రాజ్యంగా కొనసాగిన సామ్రాజ్యం) స్థాపించుకోవలసిందేననీ, అటువంటి ఈలం శాంతియుత పోరాటపద్ధతులతో ఏర్పడడం సాధ్యం కాదనీ తమిళ ప్రజానీకం భావించడం ప్రారంభించింది. ఆ భావనకు వ్యక్తీకరణగానే అనేక సాయుధ పోరాట సంస్థలు పుట్టుకొచ్చాయి. అలాంటి దాదాపు డజను సంస్థలలో ఒక్కొక్కదాన్నీ పద్ధతి ప్రకారం నిర్మూలిస్తూ ఎల్ టి టి ఇ బలమయిన సంస్థగా అభివృద్ధి చెందింది. అప్పటినుంచీ సాగుతున్న అంతర్యుద్ధంలో కనీసం ఎనభై వేల మంది హతమయి ఉంటారని అంచనా.
పోరాట సంస్థల అనుభవాలలో ఎల్ టి టి ఇ ది ఒక విశిష్ట అనుభవం. అది ప్రపంచవ్యాప్తంగా తమిళ ప్రజల, పోరాటకారుల మద్దతు కూడగట్టుకుంటూ ఆర్థిక శక్తినీ, సైనిక శక్తినీ సమకూర్చుకుంది. ఒక దశలో భారత సైనిక బలగాల నుంచి శిక్షణనూ, ఆయుధాలనూ పొందింది. తనకు అనువైన నైసర్గిక వాతావరణంలో శ్రీలంక సైనిక బలగాలను మాత్రమే కాదు, అంతకన్న చాల బలమైన భారత సైనిక బలగాలను కూడ మట్టి కరిపించింది. సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా సొంత విమానాలను, ఓడలను, జలాంతర్గాములను సంపాదించుకున్న పోరాటసంస్థగా ఘనతను సంపాదించింది. అంతర్జాతీయ స్థాయిలో పరపతిని కూడ పెంచుకుని తన తరఫున అంతర్జాతీయ సంస్థలో, నెదర్లాండ్స్ ప్రభుత్వం వంటి ప్రభుత్వాలో వకాల్తా పుచ్చుకునే పరిస్థితి కల్పించింది.
కాని ఈ క్రమంలోనే ఎల్ టి టి ఇ లోపలా బయటా శత్రువులను కూడ పెంచుకుంది. చాల సందర్భాలలో ఒంటరి అయిపోయింది. ఒక న్యాయమైన ప్రజా ఆకాంక్షకూ, దానికి నాయకత్వం వహించే సంస్థకు తెలిసో తెలియకో వచ్చే అహంకారానికీ మధ్య వైరుధ్యం ఒక అసాధారణ ప్రయోగం చేసిన పోరాటసంస్థను లోలోపలి నుంచి తినివేసింది.
అయితే అటువంటి సంస్థలు ఉంటాయా పోతాయా అనేదానికన్న ముఖ్యమైనది అవి వ్యక్తీకరించే ప్రజా సమస్యలకు ఏమవుతుందనేది. శ్రీలంకలో ఇవాళ సాగుతున్న పరిస్థితిని గత ఆరు దశాబ్దాల చరిత్ర నేపథ్యంలో చూస్తే, తమిళ ప్రజల జీవనం సింహళ పాలకవర్గాల చేతిలో మరింత దుర్భరంగా మారనున్నదనిపిస్తుంది. తమిళ ప్రజలు ఇంతకాలం అనుభవించిన వివక్ష కన్న మరింత ఎక్కువ వివక్షను, హింసను అనుభవించవలసి వస్తుందేమోననిపిస్తుంది. ఆ అణచివేత ఒక జాతి యావత్తునూ మరింతగా న్యూనతలోకి, పతనంలోకి, విధ్వంసంలోకి నెట్టవచ్చు. లేదా మరింత తీవ్రమైన, హింసాత్మకమైన ప్రతిఘటనకూ ప్రేరేపించవచ్చు. ప్రపంచచరిత్రలో రెండవ రకమైన ప్రతిస్పందన వచ్చిన దృష్టాంతాలే ఎక్కువ. ఈ రెండు పరిణామాలలో ఏది జరిగినా అది తమిళనాడులోని తమిళ ప్రజానీకపు మనసులమీద గాఢమైన ప్రభావం వేస్తుంది.